: ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ప్రధాని మోదీ!
‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ప్రధాని నరేంద్రమోదీ వ్యవహరించనున్నారు. ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ ప్రచార కార్యక్రమాలను నిర్వహించే కేంద్ర సాంస్కృతిక, టూరిజం మంత్రిత్వ శాఖ పలు చర్చల అనంతరం కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా మోదీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ యాడ్ ఫిల్మ్ కు సంబంధించిన కాన్సెప్ట్ ల విషయమై ఆయా ప్రొడ్యూసర్లను సదరు మంత్రిత్వ శాఖ అడిగినట్లు సమాచారం. ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’కు బెస్ట ఫేస్ ప్రధాని నరేంద్ర మోదీయేనని, ఎందుకంటే, ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన భారత్ గురించి విశ్వవ్యాప్తంగా తెలియజెప్పేందుకు అవకాశముంటుందని కేంద్ర మంత్రి మహేష్ శర్మ అంతకుముందు పేర్కొన్నారు. కాగా, ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్ గా మొన్నటివరకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యవహరించిన విషయం తెలిసిందే. ఒకానొక సందర్భంలో ‘భారత్ ను విడిచిపోదామని మా ఆవిడ అంది' అంటూ అమీర్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం విదితమే. ఆ తర్వాత 'ఇన్ క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్ గా అమీర్ స్థానే కొత్త వారిని నియమించేందుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సహా పలువురి ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి.