: తలాతోక లేని ప్రజెంటేషన్ ఇచ్చారు: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న ప్రాజెక్టులపై ఎన్నో ఆరోపణలు గుప్పిస్తూ ‘వాస్తవ జలదృశ్యం’ పేరిట హైదరాబాద్ రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవలే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు తలాతోక లేని ప్రజెంటేషన్ ఇచ్చారని మండిపడ్డారు. ఇంజనీర్లు, నిపుణులే ఆ ప్రజెంటేషన్‌ను తప్పుపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు మనుగడ కరవవుతోందనే ఇలాంటి ప్రచారాలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు సరిపడా నీరందించామని ఆ పార్టీ నేతలు చెప్పడం హాస్యాస్పదమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫిరాయింపులపై టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని, ఈ అంశంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందని ఆయన చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శక పద్ధతులను పాటిస్తూ తమ పాలనను కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.