: ఏటా లక్షన్నర మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు.. ఆందోళన వ్యక్తం చేసిన నితిన్ గడ్కరీ
ఏటా లక్షన్నర మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. విశాఖపట్నంలో రహదారుల భద్రతపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. దీనిలో గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటోన్న చర్యలను గురించి వివరించారు. దేశంలో ప్రమాదాలు అత్యధికంగా చోటుచేసుకుంటోన్న 786 ప్రాంతాలను తాము గుర్తించినట్లు తెలిపారు. ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని గడ్కరీ పేర్కొన్నారు. క్షతగాత్రులకు సాయం అందించడానికి జాతీయ రహదారిపై కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతున్నామని గడ్కరీ తెలిపారు. వీటి సంఖ్యను మరింత పెంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఒక అంబులెన్స్ ను ఉంచుతామని పేర్కొన్నారు. వాహనాల లైసెన్స్‌ల జారీ ప్రక్రియ ఎటువంటి అవకతవకలు లేకుండా ఉండాలని ఆయన సూచించారు. సదస్సులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా లక్షన్నరమంది చనిపోతున్నారంటే అది ఆందోళన చెందాల్సిన విషయమని, జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలుంటున్నాయని, అత్యధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటోన్న 700 బ్లాక్‌స్పాట్స్ గుర్తించినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విరివిగా సాంకేతికతను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్ చేస్తోన్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. వాహన చోదకులకు మరింత అవగాహన కల్పించాలన్నారు.