: అమెరికాలో ట్రంప్ కు నిలువెత్తు నగ్న విగ్రహం!... తొలగించిన అధికార యంత్రాంగం!
అమెరికా అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికల బరిలోకి దిగేసిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో తమ సహనాన్ని పరీక్షిస్తున్న ట్రంప్ కు ఆ దేశ ప్రజలు నిలువెత్తు నగ్న విగ్రహం పెట్టారు. ట్రంప్ కు ప్రతిరూపంగా ఆయన మేని రంగులోనే మలచిన సదరు విగ్రహంపై ఒక్క నూలు పోగు కూడా లేదు. ట్రంప్ శరీర వర్ణంతోనే తీర్చిదిద్దిన సదరు విగ్రహాన్ని మన్ హట్టన్ లోని రద్దీ ప్రాంతం యూనియన్ స్క్వేర్ వద్ద ‘ఇండిక్లెయిన్’ పేరిట జట్టు కట్టిన ఆర్టిస్టులు ఏర్పాటు చేశారు. దీనిపై సమాచారం అందుకున్న మన్ హట్టన్ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ట్రంప్ న్యూడిటీకి నిదర్శనంగా ఉన్న సదరు విగ్రహాన్ని వెనువెంటనే తొలగించారు. అధికారులు ఆ విగ్రహాన్ని తీసేసేలోగానే అటుగా వెళ్లిన ప్రతి ఒక్కరు ట్రంప్ న్యూడ్ విగ్రహాన్ని తమ కెమెరాలు, సెల్ ఫోన్లలో బంధించేశారు. ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ వైఖరికి నిరసనగానే ఈ పని చేసినట్లు ‘ఇండిక్లెయిన్’ ప్రకటించింది. మన్ హట్టన్ లోనే కాకుండా మరిన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహా నిరసనలు తెలుపుతామని ఆ సంస్థ ప్రకటించింది.