: 50 లక్షల రూపాయలతో ఢిల్లీ మెట్రో ఉద్యోగి పరారీ
ఢిల్లీ మెట్రో రైల్ కు సంబంధించిన 50 లక్షల రూపాయలతో ఉద్యోగి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఢిల్లీ మెట్రోకు చెందిన నీరజ్ అనే ఉద్యోగి, మెట్రో స్టేషన్లలో టికెట్లు వసూలు చేయగా వచ్చిన డబ్బును వివిధ స్టేషన్ల నుంచి సేకరించి, భీకాజీ కామా ప్లేస్ లో ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటాడు. ఏడు స్టేషన్ల నుంచి ఆయన ప్రతి మూడు రోజులకు ఒకసారి డబ్బులు సేకరిస్తుంటాడు. సుమారు 12 లక్షల రూపాయలు ప్రతి మూడు రోజులకు ఈ ఏడు స్టేషన్ల నుంచి వసూలు అవుతాయి. అయితే స్వాతంత్ర్య దినోత్సవం ముందు వీకెండ్ కావడంతో భారీ ఎత్తున ప్రయాణికులు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. దీంతో కలెక్షన్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దీంతో ఈ నెల 16న ఈ ఏడు స్టేషన్ల నుంచి డబ్బులు సేకరించాడు. అవి 38 లక్షల రూపాయలయ్యాయి. అంతకు ముందు వీకెడ్ కావడంతో సేకరించిన 12 లక్షల రూపాయలను బ్యాంకులో ఆయన డిపాజిట్ చేయలేదు. దీంతో 50 లక్షల రూపాయలను ఒక్కసారిగా చూసిన నీరజ్... ఆరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉద్యోగ్ భవన్ మెట్రోస్టేషన్ నుంచి డబ్బు సేకరించి, హుడా సిటీసెంటర్ వెళ్లే రైలు ఎక్కాడు. అతడు ఎయిమ్స్ స్టేషన్ కు వెళ్తే, అక్కడ అతడి కోసం ఒక ఎస్కార్టు వాహనం ఉంటుంది. దాంట్లో అతడు బ్యాంకుకు వెళ్లాలి. కానీ అతడు మాలవీయ నగర్ స్టేషన్ లో దిగిపోయి, అక్కడి నుంచి మాయమైపోయాడు. దీంతో అతనికోసం గాలిస్తున్నారు. బీహార్ కు చెందిన నీరజ్ ఎక్కువ డబ్బు చూసి ఆశపడి ఉంటాడని అనుమానిస్తున్నారు.