: కేంద్ర సాయం ప్రకటనపై పెదవి విరిచిన చంద్రబాబు
కేంద్రం ప్రకటించిన ఆర్థిక సాయంలో స్పష్టత లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం ఉదారంగా ఆలోచించాలని సూచించారు. ఏపీకి కేంద్రం ప్రకటించిన నిధులు నామమాత్రమేనని ఆయన తెలిపారు. బుందేల్ ఖండ్ కు మంచి ప్యాకేజీ ఇచ్చిన కేంద్రం ఏపీ విషయంలో అంత ఉదారంగా ఎందుకు ఆలోచించడం లేదో తెలియట్లేదని ఆయన పేర్కొన్నారు. సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా అనంతపురం, చిత్తూరు, కడపకు నీళ్లందిస్తామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇతర రాష్ట్రాల నీటి అవసరాలు తీరుస్తామని ఆయన ప్రకటించారు. ఉన్నత విద్యామండలిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు రావాలని ఆయన సూచించారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని ఆయన చెప్పారు.