: కేంద్రమంత్రి వీకే సింగ్‌పై ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సంచలన ఆరోపణలు!
కేంద్రమంత్రి వీకే సింగ్‌పై ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సంచలన ఆరోపణలు గుప్పించారు. వీకే సింగ్ గతంలో ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. తన పట్ల వీకే సింగ్ నిరంకుశంగా వ్యవహరించారని ఆయన అన్నారు. తన పదోన్నతిని అడ్డుకోవాలని చూశారని పేర్కొన్నారు. తనను శిక్షించాలనే ఉద్దేశంతోనే వీకే సింగ్ ఎంతో కఠినంగా వ్యవహరించాడని ఆయన ఆరోపించారు. ఈ మేరకు దల్బీర్ సింగ్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించారు. ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఒక వ్యక్తి... మాజీ ఆర్మీ చీఫ్, కేంద్రమంత్రిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొట్టమొదటిసారి. 2012లో వీకేసింగ్ ఆర్మీ చీఫ్‌గా ఉన్నప్పుడు నిరంకుశంగా నిరాధార ఆరోపణలతో మే 19, 2012న తనకు షోకాజ్ నోటీసు ఇచ్చారని ఆయన సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అంతేగాక, వీకేసింగ్ తనపై క్రమశిక్షణ, విజిలెన్స్ నిషేధాన్ని కూడా అమలు చేశారని ఆయన మండిపడ్డారు. గతంలో లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) రవీ దస్తానె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ దల్బీర్ సింగ్‌ను ఆర్మీ కమాండర్‌గా నియమించడంలో పక్షపాతానికి పాల్పడ్డారని పేర్కొన్న విషయం విదితమే. అనంతరం దల్బీర్ సింగ్‌ను ఆర్మీ కమాండర్‌గా నియమించారు. దీంతో జనరల్ బిక్రం సింగ్ బాధ్యతలు పూర్తయిన అనంతరం ఈయనను ఆర్మీ చీఫ్‌గా నియమించడానికి వీలైంది. అయితే, 2012 ఏప్రిల్, మే నెలల్లో దల్బీర్ సింగ్‌పై వీకే సింగ్ డీవీ నిషేధాన్ని విధించినప్పటికీ ఆయనను ఆర్మీ చీఫ్ గా నియమించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ కేసులోనే సుప్రీంకోర్టుకి దల్బీర్ సింగ్ తాజాగా అఫిడవిట్ ఇచ్చారు.