: రాఖీపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు!
రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాఖీ అంటే ఒక్క పేగు బంధమే కాదని పేర్కొన్న ఆయన... సోదరుల శ్రేయస్సు కాంక్షిస్తూ సోదరీమణులు కట్టే ఆత్మీయానుబంధంగా దానిని ఆయన అభివర్ణించారు. రాఖీ కట్టే సోదరికి ఇచ్చే కానుకను కూడా ఆయన తనదైన శైలిలో వర్ణించారు. ఎల్లప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటామని సోదరుడు తన సోదరీమణులకు ఇచ్చే కానుకే అది అని చెప్పుకొచ్చారు. ఇక రాఖీ అంటే కేవలం పేగు బంధంతో పెనవేసుకున్న సోదర సోదరీమణుల మధ్యే కాకుండా ప్రతి స్త్రీని కూడా సోదరిలా భావించేలా చేసే గొప్ప వరమని ఆయన పేర్కొన్నారు. పర స్త్రీని తల్లి, చెల్లిలా సంబోధించే మహోన్నత సంస్కృతి కలిగిన భారత దేశంలో సహోదరులు కాని వారికి సైతం ఆత్మీయానురాగాలు పంచే గొప్పతనం శ్రావణ పున్నమి సొంతమని ఆయన పేర్కొన్నారు. తనకు ఇద్దరు అక్కలు, ఓ చెల్లి ఉన్నారని... వారి ప్రేమానురాగాలను పొందానని కూడా ఆయన చెప్పారు.