: లావుగా ఉన్నారని 8 మంది మహిళా యాంకర్లను తొలగించిన టీవీ చానల్.. సన్నబడేందుకు నెల రోజుల గడువు!
స్థూలకాయం ఎంతటి చేటు తెస్తుందో ఆ టీవీ యాంకర్లకు ఇప్పుడు తెలిసొచ్చింది. టీవీలో కనిపించాలంటే నాజూగ్గా, అందంగా ఉండాలని, మీలాంటి వారిని చూడాలని ప్రజలనుకోరని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈజిప్టు ప్రభుత్వ చానల్ 8 మంది మహిళా ఉద్యోగులను తొలగించింది. నెలరోజుల్లో సన్నబడి నాజూగ్గా తయారైతేనే ఉద్యోగం ఉంటుందని తేల్చి చెప్పింది. విషయం తెలిసిన మహిళా సంఘాలు ఈజిప్షియన్ రేడియో అండ్ టెలివిజన్ యూనియన్(ఈఆర్టీయూ) తీరుపై భగ్గుమంటున్నాయి. మరోవైపు సస్పెన్షన్కు గురైన యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను ప్రజలు బాగానే ఆదరిస్తున్నారని, నిజంగా తాను లావుగా ఉన్నానో లేదో అనే విషయాన్ని ప్రజలను అడిగి తెలుసుకోవాలని ఓ యాంకర్ పేర్కొంది. ఇదంతా కావాలనే కక్షతో చేసిన పని అని ఇంకో యాంకర్ ఆవేదన వ్యక్తం చేసింది. టీవీ యాజమాన్యం చర్యతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపంలో కూరుకుపోయారని మరో యాంకర్ తెలిపింది. కాగా చానల్ తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఉమెన్స్ సెంటర్ ఫర్ గైడెన్స్ అండ్ లీగల్ అవేర్నెస్ చానల్ చర్యను ఖండించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఈఆర్టీయూపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా ఈ విషయంలో ఏమాత్రం తగ్గేది లేదని చానెల్ చెబుతోంది. వారు సన్నబడితేనే విధుల్లోకి తీసుకుంటామని అంటోంది. లావుగా ఉన్న యాంకర్లను తొలగించడంపై ఇప్పుడు ఈజిప్టు టీవీ చానళ్లు పెద్ద ఎత్తున చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై పార్లమెంటులోనూ వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి.