: బాసుల వేధింపులతోనే రామకృష్ణారెడ్డి ఆత్మహత్య!... ఘటనా స్థలిలో సూసైడ్ నోట్!
భారత సైన్యంలో ఉండగా దేశ విద్రోహ శక్తులను సమర్థవంతంగా అడ్డుకున్న రామకృష్ణారెడ్డి... తెలంగాణ పోలీసు శాఖలోని బాసుల వేధింపులను మాత్రం తట్టుకోలేకపోయారు. నేటి తెల్లవారుజామున మెదక్ జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లిలోని పోలీస్ క్వార్టర్స్ లో సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఘటనా స్థలిలో ఉన్న ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలో రామకృష్ణారెడ్డి రాసినట్లుగా భావిస్తున్న ఓ సూసైడ్ లేఖ పోలీసులకు దొరికింది. ఆ లేఖలో ఆయన పలు సంచలన ఆరోపణలు చేశారు. ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. డీఎస్పీ శ్రీధర్, సీఐ వెంకటయ్యలు తనను వేధించారని, ఆ వేధింపులు తట్టుకోలేకే తాను ఆత్మహత్య చేసుకున్నానని ఆ లేఖలో రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం మెదక్ జిల్లా పోలీసు శాఖలో ఈ లేఖ పెను కలకలమే రేపుతోంది.