: ఎడమ కాలు నొప్పితో బాధపడుతున్నా.. అందుకే భద్రతాధికారితో షూ లేసులు కట్టించుకున్నా: మరోమాట చెప్పిన మంత్రి జోగేంద్ర బెహరా
కియోంజర్‌లోని హెడ్ క్వార్టర్స్‌లో నిన్న జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన ఒడిషా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జోగేంద్ర బెహరా తన వ్యక్తిగత భద్రతాధికారితో షూ లేసులు కట్టించుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన ఇప్పటికి రెండుసార్లు స్పందించాల్సి వచ్చింది. మొదట తాను ఒక వీఐపీనని వ్యాఖ్యానించిన ఆయన లేసులు తొడిగించుకుంటే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. అయితే తాజాగా ఈ అంశంపై మరో మాట చెబుతున్నారు. తాను వంగి లేసులు కట్టుకునేందుకు తన శరీరం సహకరించడం లేదని, తాను ఎడమ కాలు నొప్పితో బాధపడుతున్నానని చెప్పారు. దీంతో తన వ్యక్తిగత భద్రతాధికారే తనకు తానుగా ముందుకు వచ్చి లేసులు కట్టాడని అన్నారు. అంతేకాదు, తనకు లేసులు కట్టిన భద్రతాధికారి తనకు కొడుకు లాంటివాడని ఆయన చెప్పారు. ఎడమ కాలు నొప్పికి చికిత్స చేయించుకోవడానికి తాను ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులను కూడా కలిసినట్లు జోగేంద్ర బెహరా తెలిపారు. ఇంకా నమ్మకం లేకపోతే వాటికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్లు సైతం చూపిస్తానని వ్యాఖ్యానించారు.