: 12 గంటలపాటు చెట్టుపై విమానం, అందులో పైలట్...కింద టెన్షన్ లో రెస్క్యూ టీం
సినిమాల్లో కనిపించే చిత్రమైన ఘటనలు నిజజీవితంలో అరుదుగా సంభవిస్తుంటాయి. అలాంటి ఘటనే జర్మనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...జర్మనీ నైరుతి ప్రాంతంలో గల బాడెన్-వుర్టెమ్ బెర్గ్ రాష్ట్రంలో తేలికపాటి విమానం సంధ్యాసమయంలో చెట్లలో కుప్పకూలింది. సమాచారమందుకున్న సహాయక బృందాలు సంఘటనా స్థలికి చేరుకున్నాయి. అక్కడ విమానం చెట్లుపై కూలి ఉండడం గుర్తించాయి. దీంతో సహాయక సిబ్బంది విమానంలోని పైలట్ ను కిందకు దింపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే భూమికి 30 మీటర్ల ఎత్తులో చెట్టుపై విమానంలో ఉన్న పైలట్ ను కిందికి దించడం సాధ్యం కాలేదు. ఇంతలో చీకటి పడడంతో చీకట్లో చేసిన ప్రయత్నాలు విఫలమైతే విమానం కిందపడి మంటలు చెలరేగే ప్రమాదం ఉందని, రాత్రంతా అతనిని అలాగే చెట్టుపై విమానంలోనే ఉంచారు. తెల్లారిన తరువాత అతనిని సురక్షితంగా కిందికి దించారు.