: ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల... రెండేళ్ల గరిష్ఠానికి టోకు ధరల ద్రవ్యోల్బణం


కూరగాయలు, వివిధ రకాల పండ్లు తదితరాల ధరలు గణనీయంగా పెరగడంతో ఆ ప్రభావం టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణంపై పడింది. దీంతో జూన్ లో 1.62 శాతంగా ఉన్న హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో 3.35 శాతం పెరిగి 4.91 శాతానికి చేరింది. మంగళవారం నాడు విడుదలైన గణాంకాల ప్రకారం, గత సంవత్సరం జూలైలో ద్రవ్యోల్బణం కేవలం 0.85 శాతం మాత్రమే పెరిగింది. 17 నెలల పాటు వరుసగా తగ్గుతూ వచ్చిన ఇన్ ఫ్లేషన్ గణాంకాలు, ఏప్రిల్ నుంచి పెరుగుతున్న సంగతి తెలిసిందే. కందిపప్పు వంటి ఉత్పత్తుల ధరలు పెరిగిన తీరు మొత్తం గణాంకాలపై ప్రభావం చూపింది. గడచిన మే నెలలో 7.88 శాతం గా ఉన్న ఫుడ్ ఇన్ ఫ్లేషన్, ఆపై జూన్ లో 8.18 శాతానికి, జూలైలో ఏకంగా 11.82 శాతానికి పెరిగింది. బంగాళాదుంపల ధరలు ఏకంగా 58.78 శాతం పెరిగాయి. టొమాటోల ధర కూడా గణనీయంగా పెరిగింది. సగటున కూరగాయల ధరలు 28.05 శాతం పెరిగాయి. పప్పుధాన్యాల ధరలు 35.76 శాతం పెరిగాయని కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. పంచదార, వంట నూనెలు వంటి మాన్యుఫాక్చర్డ్ ఫుడ్ ప్రొడక్టుల ధరలు సరాసరిన 10.19 శాతం పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎల్పీజీ, డీజెల్ వంటి ఉత్పత్తుల ధరలు తగ్గినప్పటికీ, ఆ ప్రభావం మొత్తం గణాంకాలపై పెద్దగా కనిపించలేదు.

  • Loading...

More Telugu News