: సెకనుకు రెండు సినిమాల డౌన్ లోడ్... సౌదీ శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!
ఒక సెకనులో 2 గిగాబైట్ల డేటాను బట్వాడా చేయగలిగే విధంగా అధునాతన వైర్ లెస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వారు రూపొందించిన నానో క్రిస్టలిన్ మెటీరియల్, నీలి రంగు కాంతి నుంచి తెలుపు వర్ణాన్ని వేరు చేయగలిగింది. దీంతో ఇంటర్నెట్ వేగం సెకనుకు 2 జీబీపీఎస్ వరకూ పెరుగుతుందని, కాంతి ఆధారిత సమాచార మార్పిడి టెక్నాలజీ సాకారమయ్యే సమయం ఎంతో దూరంలో లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ అయస్కాంత తరంగాలను వాడుతూ, సమాచార బట్వాడా జరుగుతుండగా, కాంతి అందుబాటులోకి వస్తే డేటా ట్రాన్స్ ఫర్ ఎన్నో రెట్లు పెరుగుతుందన్న అంచనాలతో చాలా సంవత్సరాలుగా ప్రయోగాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇంత వేగంతో నెట్ స్పీడ్ ఉంటే, సెకనుకు రెండు సినిమాలను డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం దగ్గరవుతుంది.