: నయీమ్ కేసులో ఎంతటి వారినైనా ప్రభుత్వం విడిచిపెట్టదు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మరోసారి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెసే కారణమని అన్నారు. రైతు రుణమాఫీ చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులను కట్టనివ్వకుండా కాంగ్రెస్ అడ్డుపడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి జలాలు ఆంధ్రకు తరలిపోతుంటే కాంగ్రెస్ అడ్డుకోలేదని, అటువంటి ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఆ నది జలాలపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసును సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోందని, కేసులో ఎంతటి వారినైనా తమ ప్రభుత్వం విడిచిపెట్టబోదని కర్నె ప్రభాకర్ ఉద్ఘాటించారు. చట్టంముందు అందరూ సమానులేనని ఆయన వ్యాఖ్యానించారు.