: మహారాష్ట్రలో డాక్టర్ ఉన్మాదం... కిడ్నాప్ లు, ఆపై విషమిచ్చి హత్యలు
మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో ఓ ఉన్మాద వైద్యుడి దారుణం తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. అతను ఓ అంగన్ వాడీ కార్యకర్త సహా ఆరుగురిని విషపు ఇంజక్షన్లు, ఔషధాల ఓవర్ డోస్ లు ఇచ్చి హత్య చేశాడని తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం, సంతోష్ పాల్ అనే వ్యక్తి ఇప్పటివరకూ ఐదుగురు మహిళలను, ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్యలు చేశాడు. 49 సంవత్సరాల ఎంపీపీఎస్ఎస్ఎస్ (మహారాష్ట్ర పూర్వ ప్రాథమిక్ శిక్షా సంఘ్) అధ్యక్షురాలు మంగల్ జేడీ అదృశ్యమైన కేసులో విచారణ జరుపుతున్న క్రమంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సతారా సమీపంలోని వాయ్ అనే ఊరి నుంచి పుణె బయలుదేరిన ఆమె కిడ్నాప్ కు గురికాగా, విచారించిన పోలీసులు నమ్మశక్యం కాని సంతోష్ పాల్ ఉన్మాదాన్ని వెలుగులోకి తెచ్చారు. పాల్, అతని నర్స్ జ్యోతి ఇద్దరూ కలసి ఈ కిడ్నాప్ లలో ప్రధాన పాత్రలు పోషించారు. వాయ్ ప్రాంతానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతోష్ ఫార్మ్ హౌస్ లో హత్య చేసిన వారిని దహనం చేశాడు. ఫార్మ్ హౌస్ లో మృతదేహం కాలిన ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించిన పోలీసులు, అప్పటికే తప్పించుకున్న నిందితుడిని దాదర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత మంగల్ కు, తనకు మధ్య అక్రమ సంబంధం ఉందని, తాను మంగల్ కు దగ్గరవడాన్ని జ్యోతి తట్టుకోలేక పోవడంతోనే, ఆమెపై ప్రేమతో ఈ హత్య చేశానని చెప్పుకున్న సంతోష్, ఆపై పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి తన దుర్మార్గాలను బయటపెట్టాడు. అతను హత్య చేశానని అంగీకరించిన అందరూ వివిధ స్టేషన్లలో మిస్సింగ్ కేసులుగా నమోదై ఉన్నారు. సంతోష్ ఫామ్ హౌస్ నుంచి మిగిలిన వారి అవశేషాల కోసం వెతుకుతున్నామని చెప్పిన పోలీసులు, 2003 నుంచి ఈ ప్రాంతంలో 12 మందికి పైగా అదృశ్యమయ్యారని, ఈ కేసుల వెనుక సంతోష్ హస్తముండవచ్చన్న అనుమానంతో విచారణ వేగవంతం చేశామని తెలిపారు.