: ఒక చిన్న తప్పిదం దీపా కర్మాకర్ కు పతకాన్ని దూరం చేసింది... లేకుంటే స్వర్ణం వశమయ్యేది!
దీపా కర్మాకర్ వంద కోట్ల మంది భారతీయుల ఆశలు మోసిన క్రీడాకారిణి. ప్రొదునొవా అంటే ఏంటో పెద్దగా తెలియని భారత దేశంలో ఆ క్రీడకు ప్రచారం తీసుకొచ్చిన క్రీడాకారిణి. రాత్రి జరిగిన ఒలింపిక్స్ లో ఆమె పతకాన్ని కోల్పోవడంతో అంతా నిరాశకు గురయ్యారు. నిజానికి దీప స్వర్ణానికి గురి పెట్టింది. ప్రొదునొవాలో రెండు అవకాశాలు ఇస్తారు. ఈ రెండు అవకాశాల్లో వచ్చిన స్కోరే పతకాన్ని నిర్ధారిస్తుంది. స్విట్జర్లాండ్, చైనా, ఉజ్బెకిస్తాన్, కెనడా, కొరియాకు చెందిన క్రీడాకారిణులు తమ విన్యాసాలను ప్రదర్శించారు. తరువాత దీపా కర్మాకర్ వంతు వచ్చింది. అప్పటికి స్విస్ క్రీడాకారిణి నిరాశలో మునిగిపోగా, చైనా, ఉజ్బెక్ క్రీడాకారిణులు ఆనందంగా ఉన్నారు. దీపా కర్మాకర్ తన తొలి ప్రయత్నాన్ని 14.800 పాయింట్లు సాధించగానే అంతా సంతోషించారు. తరువాతి ప్రయత్నాన్ని దీపా పూర్తి చేయగానే అందరి ముఖాల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కామెంటేటర్లు కూడా దీపా ప్రదర్శనకు ముగ్ధులయ్యారు. 17.000 పాయింట్లు ఖాయమని ప్రకటించారు. దీంతో దీపా కర్మాకర్ కు స్వర్ణం ఖాయమని భావించారు. కోచ్ కూడా అలాంటి భావనలోనే ఉన్నారు. ఇంతలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీపా కర్మాకర్ ప్లేను రీ ప్లే చేయడం ప్రారంభించారు. జంప్ ను అద్భుతమైన నియత్రణతో మొదలు పెట్టిన దీప...గాలిలో అద్భుతమైన విన్యాసం చేసింది. ల్యాండింగ్ సమయంలో అద్భుతమైన కంట్రోల్ ప్రదర్శించింది. ఏమాత్రం తొణకలేదు. అయితే ఆమె ల్యాండ్ అయిన సమయంలో డెడ్ ఎండ్ ను టచ్ చేసిందని అంపైర్లు భావించారు. రీ ప్లేలో స్పష్టత లేకున్నా... ఆమె డెడ్ ఎండ్ ను టచ్ చేసినట్టు కనిపించింది. ఇంచుమించు కూర్చుని లేచినట్టు అనిపించింది. దీంతో ఆమెకు 15.066 పాయింట్లు ఇచ్చారు. దీంతో ఇతర ఆటగాళ్లలో ఆనందం వెల్లివిరిసింది. దీపా కర్మాకర్ అలా డెడ్ ఎండ్ ను టచ్ చేయకుండా నియంత్రించుకుని ఉండి ఉంటే...భారత్ కు ఆమె స్వర్ణాన్ని కానుకగా అందించి ఉండేది.