: రియోలో 10వ రోజు... బరిలో మన ఆటగాళ్లు వీరే


రియోలో జరుగుతున్న ఒలింపిక్స్ పోటీలు 10వ రోజుకు చేరాయి. 130 కోట్ల మంది భారతీయుల పతక ఆశ ఇంకా నెరవేరలేదు. మెడల్స్ తెస్తారన్న దిగ్గజ ఆటగాళ్లు, గతంలో మెడల్స్ సాధించిన వారు ఘోరంగా విఫలమైన వేళ, నేడు వివిధ అంశాల్లో పోటీకి దిగనున్న భారత క్రీడాకారులు వీరే. లలితా బాబర్ స్టిపుల్ చేజ్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ప్రిలిమినరీ రౌండులో నాలుగో స్థానంలో నిలిచిన లలిత, తన టైమింగ్ ను మెరుగుపరచుకుంటే పతకం సాధించే అవకాశాలు ఉంటాయి. పురుషుల ట్రిపుల్ జంప్ లో రంజిత్ మహేశ్వరీ, మహిళల 200 మీటర్ల పరుగులో సర్బానీ నందా పోటీపడుతున్నారు. వీరు పతకం సాధిస్తారన్న ఆశలు పెద్దగా లేవు. ఇక మహిళల డిస్కస్ త్రోలో సీమా పునియా రేపు ఉదయం 6:20కి జరిపే ప్రిలిమినరీ పోటీలో తలపడనుంది. బ్యాడ్మింటన్ లో మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో పీవీ సింధు (అర్థరాత్రి 2 గంటలకు), ఆపై పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో కిడాంబి శ్రీకాంత్ (తెల్లవారుఝామున 5:30 గంటలకు) పోటీ పడతారు. బాక్సింగ్ లో వికాస్ కృష్ణన్ పురుషుల 75 కిలోల విభాగం క్వార్టర్ ఫైనల్స్ లో (తెల్లవారుఝామున 3:30 గంటలకు) బరిలోకి దిగుతున్నాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి సెమీస్ లోకి అడుగుపెడితే, ఆ మ్యాచ్ తో సంబంధం లేకుండానే భారత్ కు ఓ పతకం ఖాయమవుతుంది. బాక్సింగ్ లో సెమీస్ చేరి ఓడిన ఇద్దరికీ కాంస్య పతకాలు లభిస్తాయన్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్ 85 కిలోల విభాగంలో క్వాలిఫికేషన్ రౌండులో రవీందర్ ఖాత్రి (నేటి రాత్రి 8:30 గంటలకు) తలపడనున్నారు.

  • Loading...

More Telugu News