: బెలూచ్ నేతను ఆకట్టుకున్న మోదీ ప్రసంగం... సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను నిరాశపరచిందట!
నిజమే... భారత 70వ స్వాతంత్ర్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఎర్రకోటపై నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం ఎక్కడో దూరాన పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ రాజకీయవేత్తను ఆకట్టుకుంది. సదరు నేత చేత ‘జైహింద్’ నినాదాలను ఇప్పించింది. అయితే ఢిల్లీలోనే ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ టీఎస్ ఠాకూర్ ను మాత్రం నిరుత్సాహపరించింది. ఇదేదో వేరే వ్యక్తులు చెప్పిన మాట కాదు. సాక్షాత్తు టీఎస్ ఠాకూరే చేసిన వ్యాఖ్య. ఎర్రకోటపై నుంచి ప్రధాని చేసిన ప్రసంగం తనను నిరుత్సాహానికి గురి చేసిందని ఠాకూర్ నేటి ఉదయం వ్యాఖ్యానించారు. జడ్జీల నియామకానికి సంబంధించి ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రస్తావిస్తారని తాను భావించానని ఠాకూర్ అన్నారు. అయితే మోదీ ప్రసంగాన్ని ఆద్యంతం విన్నా జడ్జీల నియామకానికి సంబంధించి ప్రస్తావనే లేదన్నారు. ఇక న్యాయ శాఖ మంత్రి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం తనను మరింత నిరుత్సాహానికి గురి చేసిందని కూడా ఠాకూర్ వ్యాఖ్యానించారు.