: ఐదు పైసల కోసం నాలుగు దశాబ్దాలుగా న్యాయ పోరాటం.. రూ. ఐదు లక్షలు ఖర్చు చేసిన వైనం!


అవును.. ఐదు పైసల కోసం చేస్తున్న న్యాయపోరాటంలో వాదప్రతివాదులు కలిసి ఏకంగా రూ. పదిలక్షల రూపాయలు ఖర్చుపెట్టారు. అంతేకాదు నాలుగు దశాబ్దాలుగా ఈ కేసు నడుస్తుండడం విశేషం. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ)లో రన్వీర్ సింగ్ యాదవ్(73) 1973లో కండెక్టరుగా పనిచేసేవాడు. ఈ క్రమంలో ఓ మహిళకు టికెట్ ఇస్తూ పదిహేను పైసలు వసూలు చేశాడు. అయితే ఆమెకు 15 పైసలకు బదులు పది పైసల టికెట్ ఇచ్చాడు. ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలో ఈ విషయం బయటపడింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన సంస్థ రన్వీర్ చేసింది నేరమేనని తేల్చింది. కండక్టర్‌ను దోషిగా తేల్చిన అధికారులు సంస్థకు ఐదు పైసల నష్టం కలిగించాడంటూ 1976లో విధుల నుంచి అతడిని సస్పెండ్ చేశారు. దీంతో బాధితుడు కోర్టుకెక్కాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఐదు పైసల కోసం ఇటు బాధితుడు, అటు డీటీసీ ఐదు లక్షల రూపాయల చొప్పున ఖర్చు చేయడం! 1990లో లేబర్ కోర్టు రన్వీర్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. అతడి సస్పెన్షన్ చట్ట విరుద్ధమని పేర్కొంది. దీంతో డీటీసీ హైకోర్టును ఆశ్రయించింది. పనిచేస్తున్న సంస్థను మోసగించే ఉద్యోగిని ఉపేక్షించకూడదని హైకోర్టు పేర్కొంది. ఎంతోమంది ప్రయాణికులకు టికెట్లు ఇవ్వకుండా ఆ సొమ్మును రన్వీర్ తన జేబులో వేసుకున్నాడని డీటీసీ కోర్టులో పేర్కొంది. అతడికిది అలవాటుగా మారిపోయిందని ఆరోపించింది. ఈ సందర్భంగా రన్వీర్ మాట్లాడుతూ తన మొత్తం జీవితాన్ని మన న్యాయవ్యవస్థ నాశనం చేసిందని, తనకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదని పేర్కొన్నాడు. తాను తప్పు చేయలేదని తన పిల్లలకు తెలియజెప్పేందుకు కూడబెట్టుకున్న మొత్తం సొమ్మును ఖర్చు చేసినట్టు వివరించాడు. కాగా బాధితుడు రన్వీర్‌కు రూ.6 లక్షల గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్స్ చెల్లించాలని ఈ ఏడాది మొదట్లో డీటీసీని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

  • Loading...

More Telugu News