: చేతకాకుంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి.. నిరుద్యోగులు క్యూలో ఉన్నారు: పోలీసులకు లాలు హెచ్చరిక
మొన్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పోలీసులపై విరుచుకుపడితే తాజాగా ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్ వారిని టార్గెట్ చేశారు. బీహార్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మద్యనిషేధాన్ని తమ పరిధిలో చూసీచూడనట్టు వదిలేసే పోలీసులకు సీఎం హెచ్చరికలు జారీ చేశారు. చేతకాకపోతే ఉద్యోగాలకు రాజీనామా చేయాలని కోరారు. ఈ సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11 మంది స్టేషన్ హౌస్ ఆఫీసర్లు(ఎస్‌హెచ్‌వో)లను సస్పెండ్ చేశారు. తాజాగా ఇదే విషయమై మాట్లాడిన మాజీ సీఎం లాలుప్రసాద్ కూడా పోలీసులను హెచ్చరించారు. మద్యనిషేధం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు తప్పుకుని ఇంట్లో కూర్చోవడం మేలని సలహా ఇచ్చారు. వేలాదిమంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోందని, వారు తప్పుకుంటే ఎంతోమందికి మేలు చేసిన వారవుతారని పేర్కొన్నారు. మరోవైపు సస్పెండైన పోలీసులకు రాష్ట్రవ్యాప్తంగా 200 మంది ఎస్‌హెచ్‌వోలు మద్దతు పలుకుతున్నారు. వెంటనే వారి సస్పెన్షన్‌ను రద్దుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సస్పెన్షన్‌ను ఎత్తివేసి తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాలని ఎస్పీలకు లేఖలు రాశారు. దీంతో నితీశ్ ప్రభుత్వానికి మద్దతు పలికిన లాలు.. సీఎం వ్యాఖ్యలనే తిరిగి పేర్కొని ఆయన చేసిన పని కరెక్టేనని చెప్పకనే చెప్పారు.