: పుష్కరాల వేళ అక్కడక్కడా అపశ్రుతులు!
లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్న వేళ, కృష్ణా పుష్కరాల్లో అక్కడక్కడా అపశ్రుతులు దొర్లుతున్నాయి. ఈ ఉదయం విజయవాడలో తన తండ్రికి పిండ ప్రదానం చేస్తున్న విజయవాడ రైల్వే ఉద్యోగి కామేశ్వరరావు గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. కామేశ్వరరావు విజయవాడ రైల్వే కోచ్ డిపోలో సీనియర్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నట్టు తెలిసింది. మరో ఘటనలో అమరావతిలోని ధరణికోట వద్ద ఏర్పాటు చేసిన టెంటు కుప్పకూలగా, కర్ర తగిలి దాని కింద ఉన్న ఓ మహిళ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై వేచి వున్న భక్తుల్లో నలుగురు ఎండ వేడిమికి తాళలేక సొమ్మసిల్లి పడిపోయారు. పుష్కరాలకు ప్రకాశం జిల్లా నుంచి విజయవాడకు బయలుదేరిన ఇండికా కారు ఒకటి యడ్లపాడు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఆత్మకూరు - శ్రీశైలం ఘాట్ రోడ్డులో రెండు కార్లు స్వల్పంగా ఢీ కొన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఓ కారు డ్రైవర్ గాయపడటంతో, అతన్ని ఆసుపత్రికి తరలించారు.