: యాదగిరికి ప్రాణాపాయం లేదు ... రేపు డిచ్చార్జి చేసే అవకాశం ఉంది: వైద్యులు
సికింద్రాబాదు పరిధిలోని బోయిన్ పల్లిలో ఈరోజు జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పాత బోయిన్ పల్లిలోని మల్లికార్జుననగర్ లో బైక్ పై వచ్చిన దుండగులు కాంగ్రెస్ పార్టీ నేత యాదగిరిపై కాల్పులకు దిగిన విషయం తెలిసిందే. ఘటనాస్థలిని హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాల్పులు ఇద్దరు వ్యక్తులు జరిపినట్లు తమకు తెలుస్తోందని తెలిపారు. ఘటనాస్థలిలో రెండు ఆయుధాలు లభ్యమయినట్లు పేర్కొన్నారు. కాల్పులు జరిపిన ప్రదేశంలో ఒక తుపాకి లభ్యమయితే, మరో తుపాకిని యాదగిరి వద్ద తీసుకున్నట్లు పేర్కొన్నారు. యాదగిరి దుండగుల నుంచి తుపాకిని లాక్కున్నట్లు తమకు తెలిపాడని మహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరికి ప్రాణాపాయం లేదని వైద్యులు పేర్కొన్నారు. ఛాతి, తొడకు గాయాలయ్యాయని, చికిత్స అందిస్తున్నామని వారు తెలిపారు. రేపు యాదగిరిని ఆసుపత్రి నుంచి డిచ్చార్జి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.