: ఏ డీజీపీతోనూ నయీమ్ కు సంబంధాలు లేవు!... ఆధారాలుంటే బయటపెట్టాలంటూ మీడియాకు దినేశ్ రెడ్డి సవాల్!


తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ తో ఏ ఒక్క డీజీపీకి సంబంధాలు లేవని ఉమ్మడి రాష్ట్రానికి గతంలో డీజీపీగా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, బీజేేపీ నేత వి.దినేశ్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం లకడీకాపూల్ లోని అశోకా హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కుండబద్దలు కొట్టారు. తనతో పాటే డీజీపీగా పనిచేసిన ఏ ఒక్క పోలీసు అధికారికి కూడా నయీమ్ తో సంబంధాలు ఉండే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. ఈ విషయంలో మీడియా... అందులోనూ ప్రత్యేకించి ఎన్టీవీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు టీవీ ఛానెల్ ప్రసారం చేస్తున్నట్లు నయీమ్ కు మాజీ డీజీపీతో సంబంధాలున్నట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు. నయీమ్ ను అంతమొందించడం మంచిదేనని దినేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమాయకులకు అన్యాయం జరగొద్దన్న ఆయన... నయీమ్ ను హతం చేసిన తెలంగాణ పోలీసులకు అభినందనలు తెలిపారు. నయీమ్ ఆగడాలు తెలియగానే అతని అరెస్టుకు ఆదేశించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

  • Loading...

More Telugu News