: నా మాట బయటే... ఇంట్లో మా ఆయనే మాటే సాగుతుంది!: యాంకర్ సుమ చమత్కారం
హైదరాబాదులోని శిల్పకళా వేదికలో జరుగుతున్న 'జనతా గ్యారేజ్' సినిమా ఆడియో వేడుకలో యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. సినిమా గురించి మాట్లాడేందుకు రాజీవ్ కనకాలను సుమ ఆహ్వానించగా, 'బలహీనుడి పక్కన బలవంతురాలు నిల్చుంద'ని రాజీవ్ కామెంట్ చేశాడు. అందుకే బలహీనుడినని చెప్పి, తనకు రెండు మైకులు కూడా ఇచ్చిందని అన్నాడు. దీనికి వెంటనే అందుకున్న సుమ... 'బయట గలగలా మాట్లాడే నేను ఇంట్లో మౌనంగా ఉంటా. అక్కడ ఆయన మాటే సాగుతుందిలెండి' అంది. దాంతో ఆ సంభాషణకు కామా పెట్టిన రాజీవ్ కనకాల, జూనియర్ ఎన్టీఆర్ తో తన అనుబంధం చాలా ప్రత్యేకమైనదని అన్నాడు. తను నటించిన ప్రతి సినిమాలోను ఇంచుమించు తామిద్దరం కలిసి నటించామని చెప్పాడు. ఈ సినిమా మరింత మంచి విజయం సాధిస్తుందని అన్నాడు. 'నాన్నకు ప్రేమతో' సినిమాలో తాను చెప్పినట్టు జూనియర్ ఇంకా దూసుకుపోతుండాలని చెప్పాడు. అనంతరం మళ్లీ మొదటికొచ్చి, 'ఇక ఇప్పుడు బలవంతురాలు కొనసాగించాలి' అంటూ సుమని ఉద్దేశించి అన్నాడు. దీంతో సుమ అందుకుని, 'గతంలో నేను చాలా సార్లు చెప్పినట్టు....రాజీవ్ కనకాల... మేము మీ వెనకాల' అంటూ చమత్కరించడంతో... ఆడిటోరియం మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది.