: అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజలను అయోమయంలో పడేయొద్దు: నయీం ఎన్‌కౌంటర్‌పై ఎంపీ కవిత
కొత్త జిల్లాల ఏర్పాటుపై నిజామాబాద్ జిల్లాలో ప్రజాప్రతినిధులతో మంత్రవర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ కవిత మీడియాతో మాట్లాడుతూ నయీం ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. ఎన్‌కౌంటర్‌పై ప్రతిపక్షాలు, మీడియా అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజలను అయోమయంలో పడేయొద్దని ఆమె అన్నారు. ఈ అంశంపై అనవసర రాద్ధాంతం చేయొద్దని సూచించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అరాచక శక్తులను ఉపేక్షించబోమని ఆమె అన్నారు. నేరస్తులు లేకుండా ఉండాలన్నదే తమ ఉద్దేశమని కవిత పేర్కొన్నారు. పలువురు రాజకీయ నాయకులు తమపై ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారని, మీడియా నయీం ఎన్‌కౌంటర్‌పై ఏవేవో కథనాలు రాస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో చిన్న చిన్న జిల్లాలు ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని కవిత తెలిపారు. ప్రజాప్రతినిధులతో మంత్రవర్గ ఉపసంఘం నిర్వహిస్తోన్న భేటీలో ఈ అంశంపైనే విస్తృతంగా చర్చిస్తున్నట్లు ఆమె చెప్పారు. భేటీలో అధికారుల అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్‌లోని ప్రజాప్రతినిధులంతా వచ్చి తమ అభిప్రాయాలను తెలిపారని కవిత చెప్పారు. చిన్న జిల్లాల ఏర్పాటు సుపరిపాలన దిశగా తోడ్పడుతుందని అన్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ అందరికీ అనువుగా జిల్లాల ఏర్పాటు నిర్ణయం తీసుకుంటామని, ప్రయోజనాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. కొత్తజిల్లాల ఏర్పాటుపై ప్రజల డిమాండ్‌ని సానుకూలంగా తీసుకుంటున్నామని అన్నారు. భవిష్యత్తులో చిన్న జిల్లాల ఏర్పాటుతో ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే తాము ప్రయత్నిస్తున్నామని కవిత చెప్పారు. పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, కొత్త జిల్లాల ఏర్పాటుపై అన్ని కోణాల్లోనూ సుదీర్ఘంగా చర్చిస్తున్నామని కవిత పేర్కొన్నారు. సుపరిపాలననందిస్తూ ముందుకు వెళ్లడానికే తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.