: పుష్కరాలకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అద్భుతం: సినీ దర్శకుడు బోయపాటి శ్రీను
ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో విజయవాడలోని ఫెర్రీ పవిత్ర సంగమం వద్ద భారీ సెట్టింగ్, నమూనా దేవాలయాలు రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈరోజు ఆయన నగరంలోని పుష్కరఘాట్లో పుణ్యస్నానమాచరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర హారతిని షూట్ చేసే బాధ్యతను తాను నిర్వర్తిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిందని, తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సర్కారు చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని బోయపాటి పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాలు జరిగే 12 రోజులూ పవిత్ర సంగమం వద్దే ఉండి హారతి ఏర్పాట్లు చూస్తానని ఆయన చెప్పారు.