: భారత్ పతకాల ఖాతా ఎప్పటికి తెరిచేనో!
రియోలో జరుగుతున్న ఒలింపిక్స్ పోటీల్లో భారత్ ఇంతవరకూ ఖాతా తెరవలేకపోయింది. పోటీలు ప్రారంభమై 6 రోజులు అయిపోయినా, దేశ జనాభా పరంగా చూస్తే ఎంతో కింద స్థాయిలో ఉన్న దేశాలెన్నో పతకాలు సాధించి సగర్వంగా నిలవగా, ప్రపంచంలోనే రెండవ అత్యధిక జనాభా ఉన్న ఇండియా నిరీక్షణ కొనసాగుతోంది. పతకాలు తెస్తారన్న ఆశ పెట్టుకున్న వారిలో ఇప్పటికే పలువురు టెన్నిస్ క్రీడాకారులు ఇంటిదారి పట్టారు. పురుషుల, మహిళల డబుల్స్ విభాగంలో ఓడిపోయిన ఇండియా, మిక్సెడ్ డబుల్స్ లో మాత్రం ఓ అడుగు వేసింది. తొలి మ్యాచ్ ని సానియా, బోపన్నల జోడీ గెలిచింది. షటిల్ లో తొలి రౌండ్లలో సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ లు గెలవగా, గుత్తా జ్వాల, అశ్వని పొన్నప్ప జోడీ ఓడిపోయింది. కనీసం ఒక్క పతకమైనా వస్తుందని ఆశించిన ఆర్చరీ విభాగంలో నిరాశే ఎదురైంది. అందరు ఆర్చరీ క్రీడాకారులు విఫలమయ్యారు. పురుషుల హాకీ టీమ్ నెదర్లాండ్స్ ను ఓడించి నాకౌట్ స్థాయికి చేరుకోగా, మహిళల హాకీ టీమ్ అమెరికా చేతిలో 3-0 తేడాతో ఓడిపోయి ఇంటి దారి పట్టింది. బాక్సింగ్ లో శివ థాపా పతక వేటలో ఉన్నాడు. జిమ్నాస్టిక్స్ లో దీపా కర్మాకర్ ఏ మేరకు సత్తా చాటుతుందన్నది 14వ తేదీ గాని తేలదు. 100 మందికి పైగా భారీ టీముతో రియోకు వెళ్లిన ఆటగాళ్ల నుంచి తొలుత రెండు నుంచి మూడు స్వర్ణాలు సహా ఓ 10 వరకూ పతకాలు వస్తాయని అంచనాలు వేయగా, అదిప్పుడు కనీసం ఖాతా తెరచినా చాలన్నట్టుగా మారింది. ఇక 130 కోట్ల మంది భారతీయులు కనులు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ పతకం ఎన్నడు వస్తుందో?!