: నయీమ్ పోయినా నెట్ వర్క్ ఉందంటూ యువతి ఫోన్... బెదిరిపోతున్న బాధితులు
నయీమ్ చనిపోయాడు, అతను ఆక్రమించిన ఆస్తులను తిరిగి పొందవచ్చని భావిస్తున్న బాధితులకు బెదిరింపులు మొదలయ్యాయి. "మా భాయ్ పోయినా, అతని నెట్ వర్క్ అలానే ఉంది. నేను నయీమ్ వారసురాలిని. ఎవరైనా మా గ్యాంగ్ గురించి పోలీసులకు వివరాలు చెబితే, పరిస్థితి దారుణంగా ఉంటుంది" అంటూ ఓ యువతి ఫోన్ లో హెచ్చరికలు చేస్తోంది. గతంలో నయీమ్ చేతిలో మోసపోయి బాధితులుగా మారిన వారికి ఈ ఫోన్లు వస్తున్నాయి. ఆమె గొంతే భీతి గొలిపేలా ఉందని తెలుస్తోంది. గడచిన నాలుగేళ్లలో ఎంతో మంది అనుచరులను తయారు చేసుకున్న నయీమ్, అందులో మహిళల సంఖ్య అధికంగా ఉండేలా చూసుకుని, తనకేదైనా జరిగినా నెట్ వర్క్ దెబ్బతినకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నట్టు ఇప్పుడు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో డెన్ లను ఏర్పాటు చేసిన నయీమ్, అత్యధిక డెన్ లలో మహిళలనే డాన్ లుగా ఉంచినట్టు తెలుస్తోంది.