: కేసీఆర్ పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే!... సంపత్ కు ఆవలే మంత్రి అల్లోల!: అలంపూర్ లో ఆసక్తికర దృశ్యం
కృష్ణా పుష్కరాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ లో నేటి ఉదయం ఆసక్తికర దృశ్యం కనిపించింది. కృష్ణా పుష్కరాలను ప్రారంభించేందుకు నిన్న రాత్రికే అలంపూర్ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేటి ఉదయం సతీసమేతంగా గొందిమళ్ల పుష్కర ఘాట్ లో పుష్కర స్నానం చేశారు. ఆ తర్వాత జోగులాంబ ఆలయానికి వెళ్లిన కేసీఆర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం విలేకరులతో మాట్లాడిన సమయంలో ఆయన తన పక్కన కాంగ్రెస్ పార్టీ యువ నేత, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను కూర్చోబెట్టుకున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ పై నిత్యం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సంపత్ కుమార్... కేసీఆర్ పక్కన కూర్చోగా, అక్కడే ఉన్న తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు దూరంగా కూర్చోవడం గమనార్హం. అక్కడ వేసిన సోఫాలో కేసీఆర్, సంపత్ కుమార్ డబుల్ సీటు సోఫాలో పక్కపక్కగా కూర్చోగా దానికి కాస్తంత దూరంగా వేసిన ఇతర సోఫాల్లో టీఆర్ఎస్ నేతలు కూర్చున్న వైనం ఆసక్తి రేకెత్తించింది.