: వరుసగా నాలుగు రోజులు సెలవులు... పుష్కరాలకు భారీగా భక్తులు తరలుతారనే అంచనాలు!
ఈ వారం వరుసగా సెలవులు రావడంతో కృష్ణా పుష్కరాలకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆగస్టు 12వ తేదీన కృష్ణా పుష్కరాలు మొదలవుతున్న సంగతి తెలిసిందే. అదే రోజు వరలక్ష్మి వ్రతం ఐచ్ఛిక (ఆప్షనల్) సెలవు, 13వ తేదీ రెండో శనివారం స్కూళ్లు, కార్యాలయాలకు సెలవు. 14వ తేదీ ఆదివారం సాధారణ సెలవు, 15వ తేదీ సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఆ రోజు కూడా సెలవు. ఇలా వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. 18వ తేదీన శ్రావణపూర్ణిమ, రక్షాబంధన్ కావడంతో ఆ రోజు కూడా ఐచ్ఛిక సెలవు తీసుకునే వెసులుబాటు ఉంది. 21వ తేదీ ఆదివారం ఎలాగూ సెలవు. దీంతో వారం మధ్యలో 16,17,19,20 తేదీలు మాత్రమే పనిదినాలు. కాగా, శని, సోమ వారాల్లో పూజలు పుష్కర మూలమూర్తి శివునికి ప్రీతికరమని పండితులు చెబుతున్నారు. అలాగే శ్రావణ మాసం అమ్మవారికి ప్రీతిపాత్రమైన నెల కావున 16న శ్రావణ మంగళవారం, 18వ తేదీ గురువారం సోదరీ మణులు నిర్వహించే శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్, 19న శ్రావణ శుక్రవారం కావడంతో ఆ రోజులు ఆలయాలు, పుష్కరఘాట్లు రద్దీగా మారే అవకాశం ఉందని, అందుకు తగ్గ ఏర్పాట్లలో అధికారులు మునిగిపోయారు.