: కాశ్మీర్ పై పాట పాడిన ఏఐఏడీంకే ఎంపీ... మంత్రముగ్థమైన రాజ్యసభ!
కాశ్మీర్ పై పాడిన పాటతో యావత్తు సభను ఏఐఏడీఎంకే ఎంపీ ఎ.నవనీతకృష్ణన్ కట్టి పడేశారు. ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ తో కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై రాజ్యసభలో నిన్న చర్చ జరుగుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. తమిళ పాత సినిమాలో కాశ్మీర్ వ్యాలీలో చిత్రీకరించిన ఒక పాటను ఈ చర్చలో భాగంగా నవనీత్ కృష్ణన్ పాడారు. ‘కాశ్మీర్.. అందమైన కాశ్మీర్’ అంటూ ఆయన ఈ పాట పాడుతున్న సందర్భంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన నేతలు గులాం నబీ ఆజాద్, కరణ్ సింగ్ మరింత ఎంకరేజ్ చేశారు. ముఖ్యంగా కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ముసిముసి నవ్వులు నవ్వడం గమనార్హం. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ మరింత సమయాన్ని నవనీత కృష్ణన్ కు కేటాయించడంతో ఆ పాట మొత్తం పాడారు. అదే సమయంలో తమ పార్టీకే చెందిన మరో ఎంపీ, చిరునవ్వులు చిందిస్తున్న మైత్రేయన్ కు ఆ పాటను పాస్ చేశారు. ఈ సందర్భంగా నవనీత్ కృష్ణన్ మాట్లాడుతూ, కాశ్మీర్ చాలా మంది గర్భవతులకు తల్లితో సమానమని, అక్కడ పండించే కుంకుమపువ్వుని తిన్న గర్భవతులు పండంటి బిడ్డలకు జన్మనిస్తారని చెప్పుకొచ్చారు. తన భార్య, తన కోడలు, తన మనవరాలు సైతం ఈ కుంకుమపువ్వును తీసుకున్నవారేనని అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ అంతా ఒక్కటేనని, తాను కాశ్మీర్ కు చెందుతానని, కాశ్మీర్ తనకు చెందుతుందంటూ నవనీతకృష్ణన్ తన దేశభక్తిని చాటుకోవడంతో యావత్తు సభ చప్పట్లతో మోగిపోయింది.