: విండీస్ సిరీస్ పెద్ద సవాల్ కాదు... కుంబ్లేకు అసలైన సవాల్ ముందుంది: సెహ్వాగ్
వెస్టిండీస్ సిరీస్ టీమిండియాకు పెద్ద సవాల్ కాదని టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఢిల్లీలో సెహ్వాగ్ మాట్లాడుతూ, టీమిండియాకు కుంబ్లే అద్భుతమైన కోచ్ అని అన్నాడు. టెస్టుల్లో సెంచరీతో పాటు 600కుపైగా వికెట్లు తీసిన ఆటగాడిగా కుంబ్లేపై అంతులేని అభిమానం ఉందని అన్నాడు. కుంబ్లే సానుకూల స్వభావం కలిగిన వ్యక్తి అని సెహ్వాగ్ తెలిపాడు. కుంబ్లేది ఓటమిని అంగీకరించే తత్వం కాదని చెప్పాడు. అతని నుంచి టీమిండియా యువఆటగాళ్లు విలువైన విషయాలు నేర్చుకునే అవకాశం ఉందని అన్నాడు. అయితే కుంబ్లేకు అసలు సవాల్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్ లలో ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా టీమిండియాకు కోచ్ గా చేసే అవకాశం వచ్చినా చేసేంత తీరిక తనకు లేదని సెహ్వాగ్ తెలిపాడు.