: మానవత్వం చూపని ఢిల్లీ... యాక్సిడెంట్ అయి ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని పట్టించుకోకుండా సెల్ ఫోన్ దోచుకున్న వైనం... వీడియో వైరల్!


మనిషిలో మానవత్వం నశించిపోతోందనడానికి ఇది తాజా ఉదాహరణ. ఓ సెక్యూరిటీ గార్డును రవాణా వాహనం ఢీకొని వెళ్లిపోతే, దాదాపు గంటన్నర పాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే, కింద పడిన అతని సెల్ ఫోన్ ను దోచుకుపోయారే తప్ప, కనీస సాయం చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాని పరిస్థితి. సీసీటీవీల్లో రికార్డయిన ఈ దారుణ ఘటన ఢిల్లీలోని హరినగర్ ప్రాంతంలో జరిగింది. మతిబూల్ అనే రిక్షా కార్మికుడు రాత్రిపూట సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ పొట్టపోసుకుంటున్నాడు. తెల్లవారుఝామున 5.30 గంటల సమయంలో ప్రమాదం జరుగగా, ఆపై 7 గంటల తరువాతే పోలీసులు వచ్చారు. అతడిని ఢీకొట్టిన టెంపో నడుపుతున్న డ్రైవర్ కిందకు దిగి చూసి కూడా, వెంటనే వెళ్లిపోయాడు. ప్రాణాపాయంలో ఉన్న అతన్ని ఎంతో మంది చూసి కూడా పట్టీపట్టనట్టు వెళ్లిపోయారు. ఓ వ్యక్తి అతని దగ్గరకు వెళ్లి, పక్కనే పడివున్న సెల్ ఫోన్ తీసుకుని వెళ్లిపోయాడు. పోలీసులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, తీవ్ర రక్తస్రావం కారణంగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. యాక్సిడెంట్ నుంచి మొబైల్ ఫోన్ దోపిడీ వరకూ అన్ని దృశ్యాలూ సీసీటీవీలో నమోదై, ఇప్పుడవి వైరల్ అవుతుండగా, ఢిల్లీ ప్రజల్లో మానవత్వం లోపించిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News