: గుజరాత్ లో పటేల్ వర్గం నేతకు కీలక పదవినిచ్చిన మోదీ
గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ రాజీనామా తరువాత, ఆ రాష్ట్రంలో కీలకమైన పటేల్ వర్గానికే ఆ పదవి దక్కుతుందని అందరూ భావించారు. అందుకు తగ్గట్టే నితిన్ భాయ్ పటేల్ పేరు తెరపైకి వచ్చింది. కానీ, అనూహ్యంగా విజయ్ రూపానీని సీఎంగా ముందు నిలిపిన బీజేపీ అధిష్ఠానం, పటేల్ వర్గంలోని అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా భావనగర్ పశ్చిమ ఎమ్మెల్యే, రాష్ట్ర యువనేత జితూ వఘానీ పటేల్ ను నియమిస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారు. 46 సంవత్సరాల జితూ, 2012లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అందరినీ కలుపుకుపోయే మనస్తత్వమున్న జితూ, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించే దిశగా కృషి చేస్తారని బీజేపీ వర్గాలు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి.