: దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం పాగా.. చైనా లక్ష్యంగా రాకెట్ లాంచర్ల మోహరింపు
చైనానే లక్ష్యంగా వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ద్వీపాల్లో వియత్నాం పాగా వేసింది. ఇక్కడ ఉన్న ఐదు ద్వీపాలను ఆక్రమించిన వియత్నాం శక్తిమంతమైన రాకెట్ లాంచర్లను మోహరించింది. చైనా రన్‌వేలు, మిలటరీ స్థావరాలే లక్ష్యంగా మోహరించిన ఈ లాంచర్లు రెండు మూడు రోజుల్లోనే ప్రయోగానికి సిద్ధం కానున్నట్టు తెలుస్తోంది. వియత్నాం చర్యలపై చైనా ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో వియత్నాం స్పందించింది. రాకెట్ లాంచర్లు మోహరించిన మాట వాస్తవం కాదని కొట్టిపడేసింది. అసలు తమ వద్ద అటువంటి అత్యాధునిక లాంచర్లు లేనేలేవని వియత్నాం రక్షణశాఖ సహాయ మంత్రి, సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్‌గుయెన్ చి విన్ పేర్కొన్నారు. అయితే దక్షిణ చైనా సముద్రంలోని ద్వీపాలపై మాత్రం సర్వహక్కులు తమవేనని స్పష్టం చేశారు. కాదు కూడదంటే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. దక్షిణ చైనా సముద్ర ద్వీపాల్లో చైనా మిలటరీ బేస్‌లు నిర్మిస్తుందన్న సమాచారంతో అప్రమత్తమైన వియత్నాం రాకెట్ లాంచర్లను మోహరించినట్టు తెలుస్తోంది.