: అమరావతికి శాఖల తరలింపు... కొబ్బరికాయ కొట్టి హైదరాబాద్ కు తిరుగుటపా!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో కనీస వసతులు లేవంటూ అక్కడికి వచ్చిన వివిధ శాఖల ఉద్యోగులు, కొబ్బరికాయ కొట్టి, కార్యాలయ ప్రవేశాలు చేసి, ఆపై తిరుగుటపాలో హైదరాబాద్ కు వచ్చేయగా, నేడు ఆర్థిక శాఖ ఉద్యోగులు కూడా అదే పని చేశారు. ఈ ఉదయం ఆర్థిక శాఖ కార్యాలయాన్ని మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. వాస్తవానికి జూన్ 29 నుంచి పలు ముహూర్తాలను నిర్ణయిస్తూ రాగా, ఇక్కడి నుంచి భావోద్వేగాల మధ్య, వీడలేక వీడిపోతున్నామంటూ బస్సులెక్కి అమరావతికి వెళ్లిన ఏపీ ఉద్యోగులు తిరిగి హైదరాబాద్ కు వచ్చేసిన సంగతి తెలిసిందే. వెలగపూడిలో సిద్ధమవుతున్న భవనాల్లో వాష్ రూమ్స్, డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కూడా లేవంటూ ఆరోపించిన ఉద్యోగులు ఆ వెంటనే హైదరాబాద్ కు వచ్చేసి తమ పాత కార్యాలయాల్లో కూర్చుని పని చేసుకుంటున్నారు. తాజాగా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు నేడు సచివాలయంలో లాంఛనంగా ప్రవేశం చేసి, ఆపై హైదరాబాద్ కు పయనమయ్యారు. సచివాలయం భవనాల్లో సకల సౌకర్యాలూ అమరేందుకు మరింత సమయం పడుతుందని తెలుస్తోంది. ఇక నేడు కార్యాలయ ప్రవేశం చేయాల్సిన రెవెన్యూ శాఖ అసలు ప్రారంభోత్సవాన్నే వాయిదా వేసుకుంది.