: ఆంధ్రాలోనూ రెచ్చిపోయిన గోరక్షాదళ్ సభ్యులు.. ఇద్దరు దళితులను చెట్టుకు కట్టేసి దాడి


గోరక్షాదళ్ సభ్యుల ఆగడాలు ఆంధ్రప్రదేశ్‌కూ పాకాయి. ఆవు చర్మం ఒలుస్తున్నారనే కారణంతో ఇద్దరు దళిత అన్నదమ్ములపై కొందరు గోరక్షాదళ్ సభ్యులు దాడిచేశారు. చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. దుస్తులు విప్పేసి నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. అమలాపురంలోని జానకిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. విద్యుదాఘాతంతో మృతి చెందిన ఆవు చర్మాన్ని ఒలిచి ఇవ్వాల్సిందిగా ఆవు యజమాని.. దళత సోదరులు మోకాటి ఎలీషా, లేజర్‌ను ఆశ్రయించాడు. దీంతో వారొచ్చి చర్మం ఒలుస్తుండగా విషయం తెలిసిన గో రక్షాదళ్ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వారే ఆ గోవును చంపేశారని భావించి దాడిచేశారు. దుస్తులు విప్పించి చెట్టుకు కట్టి చితకబాదారు. తీవ్రగాయాలపాలైన బాధితులను వెంటనే అమలాపురంలోని ఆస్పత్రికి తరలించారు. ఎలీషా పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News