: ఆ గదిలో ఏముందో?... నయీమ్ బెడ్ రూం తెరిచేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కు సంబంధించిన వ్యవహారం క్షణక్షణానికి ఆసక్తి రేకెత్తుతోంది. పాలమూరు జిల్లా షాద్ నగర్ లో మొన్న జరిగిన ఎన్ కౌంటర్ లో నయీమ్ చనిపోగానే... మొన్న రాత్రే హైదరాబాదులోని అలకాపురిలోని అతడి ఇంటికి చేరుకున్న పోలీసులు అక్కడ లెక్కకు మిక్కిలి నోట్ల కట్టలు, మారణాయుధాలతో పాటు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. సదరు ఇంటిలోని రెండో అంతస్తులో నయీమ్ గది ఉంది. పోలీసుల దాడుల సమయంలో ఆ గదికి తాళం వేసి ఉందట. దానిని తెరవాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలో సదరు గదిని బద్దలుకొట్టేందుకు అనుమతించాలని నిన్న పోలీసులు ఉప్పర్ పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించిన కోర్టు ఆ గది తలుపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో నేడు నయీమ్ బెడ్ రూం తాళాన్ని పోలీసులు బద్దలు కొట్టనున్నారు. ఇప్పటికే ఆ ఇంటిలోని ఇతర గదుల్లో లభించిన సమాచారంతోనే పోలీసులు షాక్ తినగా... ఇక అత్యంత రహస్య ప్రదేశంగా భావిస్తున్న నయీమ్ బెడ్ రూంలో ఏ తరహా కీలక సమాచారం దొరుకుతుందోనన్న ఆసక్తి నెలకొంది.