: పార్లమెంటులో ‘ఆంధ్రా’ అమిత్ షా!... గడ్డం పెంచి కొత్త లుక్ లో మాగంటి బాబు!


నిజమేనండోయ్... పార్లమెంటులో ‘ఆంధ్రా’ అమిత్ షా హల్ చల్ చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాదిరే కనిపిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఎంపీ మాగంటి బాబు అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఎప్పుడూ క్లీన్ షేవ్ తో కనిపించే ఆయన తాజాగా గడ్డం పెంచేశారు. ఇంకేముందీ... శరీరాకృతిలోనే కాకుండా తలకట్టు తీరులోనూ అమిత్ షా లా కనిపించే మాగంటి... ప్రస్తుతం అమిత్ షా మాదిరే గడ్డం పెంచడంతో ఆయనను చూసిన వారంతా అమిత్ షాగానే మాగంటిని పొరబడుతున్నారు. పార్లమెంటు లాబీల్లో మాగంటి కూర్చోగా... ఆయనను అమిత్ షా లా భావించి పలువురు బీజేపీ ఎంపీలు దగ్గరికి వచ్చి తిరిగి వెళుతున్నారు. ఓ సందర్భంలో మాగంటి లాబీల్లో నడుచుకుంటూ వెళుతుంటే ఓ బీజేపీ ఎంపీ... ఆయనను అమిత్ షా లా భావించి ఏదో చెప్పబోయారట. ఈ క్రమంలో నిన్న టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం వద్ద ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజులు టీడీపీపీపీ కార్యాలయం వద్దకు రాగా... అక్కడ ఉన్న మాగంటి వారికి కూడా అమిత్ షాలానే కనిపించారు. ‘‘చూడటానికి మా అమిత్ షా లానే ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తున్నట్లు ఏ రాత్రో మీరే ఓ ప్రకటన చేయొచ్చుగా?’’ అని వారు మాగంటితో అన్నారు. దీనికి స్పందించిన మాగంటి ‘ప్రత్యేక హోదా ఫైల్ పై సంతకం చేస్తూ ఓ ఫొటో తీసుకుని దానికి మీడియాకు పంపుతాను. ఆ ఫొటోలో ఉన్నది అమిత్ షానే అనుకుని మీ పార్టీ ఇబ్బంది పడక తప్పదు’ అని అంతే చమత్కారంతో బదులిచ్చారు.

  • Loading...

More Telugu News