: సర్కారు కోర్టుకు చెప్పిన అంశాల గురించి తెలిసింది.. 123 జీవోపై సుప్రీం మెట్లెక్కుతాం: కాంగ్రెస్
123 జీవో రద్దును నిలిపివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 123 జీవోపై సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు. తెలంగాణ సర్కారు కొత్త భూ సేకరణ జీవో గురించి పలు అంశాలను కోర్టుకి తెలిపిందని, 2013 భూసేకరణ చట్టంలోని అన్ని అంశాలను దానిలో చేర్చుతామని పేర్కొన్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. తాము జీవోను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రైతులు, కూలీలు, నిర్వాసితులకు న్యాయం జరగక పోతే తాము ఊరుకోబోమని అన్నారు. 2013 చట్టాన్ని నిర్లక్ష్యం చేయవద్దని ఆయన సూచించారు.