: ఆ 'హృదయ' స్పందనలే తండ్రి ఆశీర్వాదాలుగా భావించి పెళ్లి చేసుకుంది!


అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన జెనీ స్టెపైన్ అనే యువతి తండ్రి మైకేల్ స్టైపైన్ పదేళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. అయితే, మైకేల్ కుటుంబసభ్యుల అంగీకారంతో ఆమె తండ్రి గుండెను ఆపదలో వున్న మరో వ్యక్తికి అమర్చారు. ఆ వ్యక్తి పేరు ఆర్థర్ థామస్. అతను న్యూజెర్సీలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో స్టైపైన్, ఆర్థర్ కుటుంబాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు, ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్ కొనసాగుతున్నాయి. కట్ చేస్తే... జెనీ స్టెపైన్ కు పౌల్ మెన్నెరర్ తో వివాహం నిశ్చయమైంది. క్రిస్టియన్ సంప్రదాయ ప్రకారం పెళ్లి కుమార్తె తండ్రి కూతురు చేయి పట్టుకుని వివాహం జరిగే చోటుకు తీసుకురావడం ఆనవాయతీ. అయితే, తన తండ్రి స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి కోసం ఆమె తెగ ఆలోచించింది. అందుకు తన తండ్రి గుండె అమర్చిన ఆర్థర్ థామస్సే సరైన వ్యక్తని జెనీ కి కాబోయే భర్త పౌల్ సూచించడంతో ఆమె ఎగిరి గంతేసింది. వెంటనే ఆర్థర్ థామస్ కు ఫోన్ చేసి ఇదీ విషయమని చెప్పడంతో, అందుకు ఆయన కూడా సంతోషంగా అంగీకరించాడు. గత శుక్రవారం పిట్స్ బర్గ్ సమీపంలోని ఒక చర్చిలో జెనీ పెళ్లి జరిగింది. జెనీ పెళ్లి రోజున తండ్రి స్థానంలో ఉన్న థామస్ ఆమె చెయ్యి పట్టుకుని వేదికపైకి తీసుకువెళ్లాడు. థామస్ గుండెలపై చెయ్యి వేసి ఆ హృదయ స్పందనలే తన తండ్రి ఆశీర్వాదాలుగా భావించిన జెనీ ఆనందానికి హద్దుల్లేవు. కాగా, మైకేల్ గుండెను తనకు అమర్చడం కారణంగానే తన నలుగురి పిల్లల మంచిచెడ్డలు చూసుకోగలిగానని, జెనీకి తండ్రి లేని లోటు తీర్చలేకపోయినప్పటికీ ఈ విధంగా ఎంతో కొంత ఆనందాన్నిచ్చానని థామస్ చెప్పాడు.

  • Loading...

More Telugu News