: ఢిల్లీలో ఏచూరిని కలిసిన జగన్.. హోదాపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తమ పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ పలువురు నేతలను కలుస్తూ హోదాపై మద్దతు తెలపాలని కోరుతున్నారు. ఈరోజు ఆయన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధించే క్రమంలో తాము వెనకాడబోమని, తమ పోరాటాన్ని విడవబోమని అన్నారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని జగన్ సూచించారు. పార్లమెంట్ సాక్షిగా ఆనాడు ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని, లేదంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోలేమని ఆయన అన్నారు. పార్లమెంట్ విశ్వసనీయత కోల్పోయే పరిస్థితి వస్తుందని అన్నారు. హోదాపై తాము ఏపీలో పోరాటాన్ని కొనసాగిస్తూనే ఇతర పార్టీలను ఈ ఉద్యమంలో కలుపుకుని ముందుకు వెళతామని స్పష్టం చేశారు. కేంద్రంపై ప్రత్యేక హోదా అంశంలో ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు.