: నయీమ్ గ్యాంగ్ లో లేడీ ఫైటర్లు!... ఉప్పర్ పల్లి కోర్టుకు ఫరానా, హర్షియా!
ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్ యూ) నేతగా ప్రస్థానం ప్రారంభించిన నయీమ్ తదనంతర కాలంలో తెలంగాణ పోలీసులకు కొరకరాని కొయ్యగా మారాడు. బెదిరించి డబ్బు వసూలు చేయడం, భూములను ఆక్రమించడం తదితర కార్యకలాపాలతో గ్యాంగ్ స్టర్ గా రూపాంతరం చెందిన అతడు భారీగా ఆస్తులు కూడబెట్టాడు. ఈ క్రమంలో నయీమ్ తన ముఠాలో దాదాపు వందల మంది సభ్యులను చేర్చుకున్నాడని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ ముఠా సభ్యుల్లో మహిళలు కూడా వున్నారని తాజాగా తేలింది. ఈ మహిళా సభ్యులు ఆషామాషీగా ఏమీ ఉండరట. పురుషులకు ఏమాత్రం తీసిపోని రీతిలో వీరు ఫైటింగ్ లో ఆరితేరిన వారు. నిన్న పాలమూరు జిల్లా షాద్ నగర్ లో జరిగిన ఎన్ కౌంటర్ సమయంలో ఇద్దరు లేడీ ఫైటర్లు అతడి వెంట ఉన్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నయీమ్ హతం కాగా లేడీ ఫైటర్లు ఫరానా, హర్షియాలు సజీవంగా పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని హైదరాబాదులోని నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు రెండు గంటలకు పైగా విచారించారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం వారిని ఉప్పర్ పల్లి కోర్టుకు తరలించారు.