: టీఆర్ఎస్ తో పెట్టుకోకుంటే నయీమ్ మరికొన్నేళ్లు బతికేవాడు!
ఆంధ్రప్రదేశ్ లో గ్రేహౌండ్స్ దళాల సృష్టికర్త ఐపీఎస్ వ్యాస్ ను హత్య చేసిన గ్యాంగ్ స్టర్ నయీమ్, ఇప్పుడు అదే గ్రేహౌండ్స్ దళాల చేతుల్లో హతుడయ్యాడు. ఓ నక్సలైట్ గా ఉండి, పోలీసులకు సహకరిస్తూ, వారి అండదండలతో ఎదిగి వేల కోట్ల రూపాయల అక్రమాస్తులను కూడబెట్టి, ఓ నేర సామ్రాజ్యాన్నే స్థాపించిన నయీమ్, బడాబాబులు, ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు అమాయకులనూ వేధించేవాడు. నయీమ్ నేరాల చిట్టా ఇంతగా పెరగడానికి పోలీసులు ఇచ్చిన అలుసు కూడా కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత నయీమ్ కొంతకాలం పాటు అజ్ఞాతంలో ఉండి, ఆపై మళ్లీ తనదైన శైలిలో బెదిరింపులకు పాల్పడటం మొదలు పెట్టాడు. ఈ దఫా నయీమ్ కన్ను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనే పడింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను స్వయంగా బెదరించాడు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని ఏకంగా దుర్భాషలాడుతూ, నియోజకవర్గంలోకి రావాలంటే తన అనుమతి తప్పనిసరని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో వీరంతా నయీమ్ ఆగడాలపై స్వయంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో పోలీసు శాఖ కదిలింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందడంతో, ఎలాగైనా నయీమ్ ను మట్టుబెట్టాలన్న ఆలోచనతో ఆరు నెలల నుంచి ప్లాన్ చేసిన గ్రేహౌండ్స్ దళాలు, ఇంటెలిజెన్స్ విభాగంతో సమన్వయంతో పనిచేసి ఆయన కదలికలపై గట్టి నిఘా ఉంచాయి. ఈ నేపథ్యంలోనే ఓ సెటిల్ మెంట్ నిమిత్తం షాద్ నగర్ కు వచ్చిన ఆయన్ను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదరించుకుంటే మరికొన్నేళ్లు నయీమ్ ఆగడాలు కొనసాగేవేమో!