: నయీమ్ భార్య పోలీస్ స్టేషన్ కు!... పిల్లలు మాత్రం కస్తూర్బా ఆశ్రమానికి!
మొన్నటిదాకా అత్యంత విలాసవంతంగా సాగిన గ్యాంగ్ స్టర్ నయీమ్ కుటుంబం జీవనశైలి... అతడి ఎన్ కౌంటర్ తో ఒక్కసారిగా తలకిందులైంది. నిత్యం మందీ మార్బలంతో తిరిగే నయీమ్... హైదరాబాదులోని అలకాపురిలోని తన కుటుంబానికి సకల సౌకర్యాలు అందించాడు. ఇంటిలో ఎక్కడ చేయి పెట్టినా నోట్ల కట్టలే. ఆ ఇంటిలో చేతులు మరింత లోతుగా వెళితే... మారణాయుధాలకు కూడా కొదవే లేదు. చేతినిండా సొమ్ము, తిరిగేందుకు కార్లు, కోరుకోగానే అన్నీ ముందు వాలే స్థితిలో ఆ కుటుంబం మొన్నటిదాకా దాదాపుగా రాజభోగమే అనుభవించింది. అయితే నిన్న ఉదయం పాలమూరు జిల్లా షాద్ నగర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో నయీమ్ గ్రేహౌండ్స్ తూటాలకు నడిరోడ్డుపై ప్రాణాలు వదిలాడు. సాయంత్రానికే రంగంలోకి దిగిన పోలీసులు అలకాపురిలోని అతడి ఇంటిలో ప్రత్యక్షమయ్యారు. ఇంటిని అణువణువునూ సోదా చేసిన పోలీసులు ఇంటిలోని నోట్ల కట్టలతో పాటు మారణాయుధాలను కూడా పట్టుకెళ్లారు. ఇక ఇంటి యజమానురాలిగా ఉన్న నయీమ్ భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి పిల్లలను మాత్రం మానవతా దృక్పథంతో కస్తూర్బా ఆశ్రమానికి తరలించారు.