: అజిత్ దోవల్ వేతనం రూ.1.62 లక్షలే!... పీఎంఓ సంయుక్త కార్యదర్శుల కంటే తక్కువేనట!
జాతీయ భద్రతా సలహాదారు హోదాలో ఉన్న అజిత్ దోవల్... ప్రధాని నరేంద్ర మోదీ జట్టులో కీలక వ్యక్తి. విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రతకు సంబంధించి మోదీకి అన్ని వేళలా సాయంగా నిలుస్తున్న దోవల్.... గతంలో ఇంజెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన సమయంలో పేరుమోసిన గూఢచారిగా ఖ్యాతిగాంచారు. మోదీ ప్రధాని అయ్యాక దోవల్... కీలకమైన జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. మరి ఈ హోదాలో ఆయన వేతనమెంతో తెలుసా? ఇప్పటిదాకా ఈ తరహా పోస్టుల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించిన వేతనాలు మనకు తెలియవు. అయితే మోదీ పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్న నేపథ్యంలో ఈ వేతనాలు కూడా జనానికి తెలిసొచ్చాయి. అయినా అజిత్ దోవల్ వేతనం ఎంతనేగా మీ ప్రశ్న?... నెలకు అక్షరాలా రూ.1,62,500. ఇదే దేశంలో అత్యధిక వేతనమా అంటే... ఎంతమాత్రం కాదు. ఎందుకంటే పీఎంఓలో ప్రధాని కార్యదర్శిగా పనిచేస్తున్న భాస్కర్ కుల్బే నెలకు రూ.2 లక్షలు తీసుకుంటున్నారు. ఇక దోవల్ తో సరిసమానంగా వేతనం తీసుకుంటున్న వారు కూడా మరో ఇద్దరు ఉన్నారు. వారిలో పీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న నృపేంద్ర మిశ్రా ఒకరు కాగా, అదనపు ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్కే మిశ్రా మరొకరు. ఇదిలా ఉంటే... దోవల్ కంటే కింది స్థాయిలో పీఎంఓలో సంయుక్త కార్యదర్శులుగా పనిచేస్తున్న చాలా మంది అధికారులు ఆయన కంటే కాస్తంత ఎక్కువగానే వేతనం తీసుకుంటున్నారు. పీఎంఓలో సంయుక్త కార్యదర్శుల వేతనం నెలకు రూ.1,77,750గా ఉంది. ఇక పీఎంఓలో అత్యంత తక్కువ వేతనం తీసుకుంటున్న వారిలో మల్టీ టాస్కింగ్ స్టాఫేనట. వీరికి నెలకు రూ.17వేలు మాత్రమే అందుతోంది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ పిటిషన్ కు స్పందించిన పీఎంఓ ఈ వివరాలను వెల్లడించింది.