: విడుదలకు ముందే రూ.350 కోట్ల బిజినెస్!... ‘బాహుబలి-2’పై నేషనల్ మీడియా కథనాలు!
భారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాసిన ‘బాహుబలి’ సీక్వెల్... ‘బాహుబలి-2’(బాహుబలి: ద కన్ క్లూజన్) పై నేషనల్ మీడియాలో పలు ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం విడుదలకు ముందే రూ.350 కోట్ల మేర బిజినెస్ చేసే అవకాశాలున్నట్లు సదరు కథనాలు అంచనా వేస్తున్నాయి. టాలీవుడ్ హిట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో... యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితర భారీ తారాగణం నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం తమిళ హక్కులు భారీ ధరకు అమ్ముడుబోయినట్లు గత వారంలో నేషనల్ మీడియాలోనే ఓ కథనం ప్రచురితమైంది. తాజా కథనంలో విడుదలకు ముందు భారీ మొత్తంలో వసూళ్లను రాబట్టిన చిత్రంగా ‘బాహుబలి-2’ సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయమని నేషనల్ మీడియా ఆసక్తికర కామెంట్లు చేసింది.