: వెదికిన చోటంతా నగదు, ఆయుధాల గుట్టలు!... 3 జిల్లాల్లో నయీం స్థావరాలపై ముమ్మర సోదాలు!
తెలంగాణ పోలీసులు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ గా భావించిన నయీమ్ హతమైపోయాడు. ఈ క్రమంలో అతడికి చెందిన స్థావరాలను జల్లెడ పడుతున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లో లభిస్తున్న నగదు, ఆయుధాలను చూసి షాక్ తింటున్నారు. నయీమ్ ఎన్ కౌంటర్ ముగిసిన వెంటనే నిన్న సాయంత్రానికే పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు. హైదరాబాదు, పాలమూరు జిల్లాలతో పాటు నయీమ్ సొంత జిల్లా నల్లగొండలోని పలు ప్రాంతాల్లోని నయీమ్ కు చెందిన ఇళ్లు, అతడి బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో పోలీసులు వెదికిన ప్రతిచోటా పెద్ద మొత్తంలో కరెన్సీ కట్టలు, పిస్టళ్లు, తపంచాలు, బుల్లెట్లు పెద్ద సంఖ్యలో పట్టుబడ్డాయి. పట్టుబడ్డ సొమ్ము కోట్లాది రూపాయల్లో ఉన్నట్లు సమాచారం. ఈ నగదును లెక్కించేందుకు పోలీసులు ఏకంగా కౌంటింగ్ మెషీన్లను వినియోగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.