: మోదీ, కేసీఆర్‌లు ఒకరినొకరు ప్రశంసించుకోవడానికే సమయం సరిపోయింది: పొన్నాల
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో టీపీసీసీ నేతలు ఒక్కొక్కరుగా మండిపడుతున్నారు. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ నేత పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. మోదీ పర్యటనతో తెలంగాణకు చేకూరే లాభం ఏమీ లేదని అన్నారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలుపై మోదీ స్పందించకపోవడం విచారకరమని ఆయన అన్నారు. మెదక్ సభలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు పరస్పరం ప్రశంసించుకోవడానికే సమయమంతా తీసుకున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికే మోదీ, కేసీఆర్ ప్రయత్నించారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై కేసీఆర్ నిర్లక్ష్యం వహించారని హైకోర్టు, ఉద్యోగుల విభజన, జాతీయ ప్రాజెక్టులపై ఎందుకు స్పందించలేదని ఆయన విమర్శించారు. గోసంరక్షకులపై మోదీ చేసిన వ్యాఖ్యలు హంతకులే సంతాప సభ పెట్టినట్లుందని అన్నారు.